14, ఆగస్టు 2011, ఆదివారం

నాకా ఆగస్ట్ పదిహేనే కావాలి


"నాకు ఆగస్ట్ పదిహేనే కావాలి..." కోరిక గా ..
" ఏది ?" సందేహం గా
"అదే " మొండిగా
"ఏదే..?" కొంచం విసుగ్గా..
" అదే నాకు ఏడేళ్ళ వయసులో పొద్దున్నే లేచి స్నానం చేసి. పక్క పాపిడి తీస్కోని దువ్వుకొని. ఆకుపచ్చ లాగూ పై తెల్ల చొక్కా వేస్కొని, వేడి అన్నంలో పెరుగు వేస్కొని హడావిడి గా తిని, హవాయి చెప్పులతో పొద్దున్నే
స్కూల్ కెళ్ళి , ఎవరో ఇచ్చిన కాగితపు జండా బాడ్జ్ చొక్కాకి పెట్టుకొని, పూలతో జండా కర్ర మెట్లు అలంకరించి. సున్నం తో వేసిన లైన్ల మీద కుదురుగా నుంచోని, సరిగ్గా ఎనిమిది కి మా సుగుణమ్మ ప్రిన్సిపాల్ గారు ఎగర వేసిన జండాకి వందనం పెట్టి . ఆమె చెప్పిన నాలుగు మాటలు వినీ విననట్లు ఉండి. అదయ్యాక అక్కలు పంచిన బిళ్ళలు చప్పరించి, పది దాకా స్కూల్లోనే ఆడుకుంటూ, దేశ భక్తి ప్రదర్శిస్తూ, ఎండ ఎక్కాక ఇంటికెళ్ళిన రోజుల్లోని ఆగస్ట్ పదిహేను." వస్తుందా మళ్ళీ ఆశగా..
"ఇప్పుదేమైందట" కరుగ్గా ..
" ఏమీ కాలేదు మామూలు రోజుల్లో ఆఫీసులో సరిగ్గా టైముకు రాక, వచ్చాక సీట్లో లేక పెత్తనాలు చేసే జనం రోజు పొద్దున్నే వచ్చి ఆఫీసు డబ్బులతో టిఫిన్లు మెక్కి, దేశ భక్తి, నిస్వార్ధమూ , త్యాగమూ , పునరంకితమూ
అంటూ కొన్ని వాళ్ళకీ తెలీని మాటలు మాట్లాడి చెమట తుడుచుకొని ఏసీ లోకి వచ్చి రిలాక్స్ అవుతుండటం నాకు నచ్చలేదు."
" దేశ సేవ పేరుతో పంది కొక్కుల్లా తిని తెగ బలిసి తన్నుకుంటున్న నాయకులు నాకు నచ్చలా "
" లంచాల సొమ్ము కోసం ప్రజలని పీడించే ప్రభుత్వ జలగలు నాకు నచ్చలా"
" మన కెందుకూ మన డాలర్లు మన కొస్తున్నాయా లేవా అని చూసుకునే వలస మేధావులు నాకు నచ్చలా"
" మనం మార్చగలిగేవి కావు కుళ్ళు రాజకీయాలు, తీర్చగలిగేవి కావు కష్ట నష్టాలు అంటూ వక్కపొడి నములుతూ వెనక్కి వాలే నిలవ మేతావులు నాకు నచ్చలా" ..ఉక్రోషం గా
" అందుకే నా పాత ఆగస్ట్ పదిహేనన్నా తెచ్చివ్వు లేదా ఇంకా వెనక్కి వెళ్లి తెల్ల పాలనన్నా తెచ్చివ్వు " అమాయకంగా
" ఎందుకూ.." అయోమయం గా ..
" మళ్ళీ బ్రిటీష్ వాళ్ళతో పోరాడి మీరు మరో స్వాతంత్రం తెచ్చుకుంటే నన్నా విలువ తెలుస్తుందేమో అని " కసిగా

" నిస్వార్ధం గా అవినీతి పై పోరాడాలంటే ఇన్ని కస్టాలు పడాలా అని వాపోయే వీరులందరికీ నా మల్లె పూదండ " ఆర్తి గా
జై
హింద్ !!


2, జనవరి 2011, ఆదివారం

అన్నమయ్య పి.వో


ఈ నాటి నా ఈ ఐదో మల్లెపూదండ శ్రవణ్ గారికి. ఎవరీ శ్రవణ్ ?? బ్లాగ్ వీధుల్లో సంచరించే మిత్రులకి పెద్దగా చెప్పక్కర్లేదు, అయినా మల్లె పూదండ తో సత్కరిస్తూ పరిచయ వాక్యాలు రాయక పోతే మా సన్మాన సంఘం మరీ ఖాళీ గా ఉన్నట్టే, అందుకే ఈ పరిచయం.

జగమెరిగిన అన్నమయ్యకి ఉన్న ఎంతో మంది పబ్లిసిటీ ఆఫీసర్ల లో శ్రవణ్ ఒకరు.

పిడుగురాళ్ళ లో పుట్టిన శ్రవణ్ గారు ఆర్ఈసి వరంగల్ లో ఇంజనీరింగ్ పట్టభద్రుడు. తల్లితండ్రులు కనక దుర్గ , సుబ్రహ్మణ్యం గారలు. అమ్మగారి స్ఫూర్తి తో ఆయనకు సంగీతం మీద, అదీ అన్నమయ్య కీర్తనల మీద మంచి ఆసక్తి కలిగింది. ఆ ఆసక్తి కేవలం విని ఊరుకోవటం వరకే కాకుండా పది మందికి ఉపయోగ పడే విధంగా తీర్చి దిద్దు కోవటం అయన సుసంస్కారం.

ఇరవై ఏడు ఏళ్ళ వయసుతో బాటు ఈయనకి ఒక ఎంఎన్ సి టెలికాం కంపనీ లో గట్టి ఉద్యోగం, ఉరకలేసే ఉత్సాహం , మీదు మిక్కిలి ఎన్నో ఆనందాలు అందిచ్చే హైదరాబాద్ నగరం లో నివాసం, ఇవన్నీ ఉన్నా అయన వారాంతం లో ఏ మిత్రులతో సినిమాహాల్లోనో, పబ్ లోనో, పిక్నిక్ స్పాట్ లోనో సమయాన్ని చంపకుండా.. తొలి తెలుగు వాగ్గేయ కారుడు అన్నమాచార్యునితో టైం పాస్ చేస్తారు.

శ్రవణ్ ఇంట్లోనే అన్నమయ్య కూడా ఉంటారు. శ్రవణ్ ఆయనతోనే ఎక్కువ సమయం గడుపుతారు. నిజం, ఉద్యోగ సమయం లో తప్ప మిగతా సమయం లో హెచ్చు మొత్తం అన్నమయ్య కీర్తనల సాహిత్యం, శ్రవణరూపం, ఇంకా ఆ కీర్తనల యొక్క ప్రశస్తి, వివరాల సేకరణ లో ఉంటారు. అలా సేకరించిన విషయాల్ని తన బ్లాగ్ అన్నమయ్య లో పొందుపరుస్తారు.

ఆ వివరాలు అన్నమయ్య కీర్తనల ప్రియులకు తిరుపతి లడ్డు లాంటివి. ఇప్పటివరకు సుమారు 733 కీర్తనల ఆడియో లింకులు, సాహిత్యం తో బాటు ఆ అంశాలకి సంభందిచిన వివరాలు, కీర్తన పాడిన వారి చిత్రాలు, కూడా ప్రచురిస్తున్నారు. అంతే కాక ఆ బ్లాగ్ ని ఒక తీరుగా అమర్చారు. మనకి కావాలిసిన కీర్తన వెతుకోవటానికి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అక్షర క్రమం లో ఉంచారు. అంతే కాక తి తి దే వారు ప్రచురించిన 29 సంకలనాల అన్నమయ్య సాహిత్యాన్ని కూడా pdf లో ఉంచారు. ఇక పోతే అన్నమయ్య రేడియో ఎల్లప్పుడూ వీనుల విందు చేస్తూనే ఉంటుంది.

అన్నమయ్య గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. దాదాపు ముప్పై ఏళ్ళ క్రితం మాత్రం చాలా మంది సామాన్యులకు ఆ సాహిత్య ప్రతి దొరక్క, వినడానికి సరియిన ఉపకరణాలు లేక, అసహాయ స్థితి లో ఉండటం నాకు బాగా గుర్తుంది. అలాంటిది రెండువేల పైగా కీర్తనలు గుర్తింపబడి, స్వరపరచ బడి, ఎందరో సంగీత స్రష్టల కృషి, తి తి దే వారి సహకారాల తో అన్నమయ్య సాహిత్యం ప్రాచుర్యం లోకి వచ్చింది.

అవన్నీ ఎప్పటికైనా తన బ్లాగ్ ద్వార అందుబాటు లోకి తేవటం అయన అభిలాష. మన మల్లె పూదండ లో ఉన్న వ్యక్తి దీపాల వెంకట నాగార్జున శ్రవణ్ తమ అమూల్యమైన సమయాన్ని ఇలా జనోపకారం కోసం వెచ్చించటం నిజంగా ముదావహం. ఆయన్ని నేను చూడలేదు, అయన బ్లాగ్ లో ఒకటీ రెండు వ్యాఖ్యల పరిచయం అంతే. కానీ ఆ బ్లాగ్ టపా ల ద్వారా అయన నాకు ఎంతో ఆత్మీయం గా అనిపించారు. ఉద్యోగం, అన్నమయ్య బ్లాగ్ వ్యాపకాలతో బాటు అయన వయోలిన్ నేర్చుకోవటానికి ప్రయత్నించటం, ఎం.ఎస్ విద్య ను అభ్యసించటం వంటి ఫలవంతమైన పనులు చేస్తున్నారు. ఆయన లాంటి ఆదర్శనీయమైన యువత ఇంకా లక్షల మందికి స్ఫూర్తి కావాలని మనసార కోరుకుంటున్నాను. అన్నమయ్య సంకీర్తనల మీద అయన నాలుగు బ్లాగులు నిర్వహిస్తునారు. అది కాక జానపదాలు, త్యాగయ్య కీర్తనలు ఇంకా అనేక సంగీత సాహిత్య వివరాలను తన రామచిలుక పలుకులు
లో పొందుపరుస్తున్నారు.

కేవలం బాగా చదువు కోవటమో, మంచి ఉద్యోగం చేస్తూ తన సంగతి తాను చూసుకొని బాగా బతకటమో, లేదా ఎలాంటి ఆసక్తి లేకుండా నిస్సారమైన బతుకు వెళ్లదీసే వాళ్లకు అప్పుడప్పుడు శ్రవణ్ లాంటి వాళ్ళు మల్టీ విటమిన్ టాబ్లెట్ లాగా పనిచేయాలి.


వివిధ రకాలుగా సమయం వృధా చేసే ఎందరికో శ్రవణ్ ఒక ఆదర్శం కావాలి. అందరూ సంగీతమే పాడక్కర్లేదు, అందరూ సంఘ సేవ చెయ్యక్కర్లేదు, కానీ నీ తీరిక సమయం లో ఏమి చేస్తున్నావని అడిగితే "నేను ఇది చేస్తున్నా.." అని గర్వంగా చెప్పుకోదగ్గ ఏ పని చేసే వాళ్లెవారికైనా మల్లె పూదండ సిద్ధం.


ఈమధ్యే
వివాహం అయిన శ్రవణ్ కు అయన సతీమణి కు మన బ్లాగ్ మిత్రుల తరుపున అభినందనలు.




చిన్న వయసులోనే సమాజం పట్ల భాద్యత చూపుతూ సేవ చేసే యువత కు ఇంకో మల్లె పూదండ తో కలుస్తా.. సెలవ్


26, డిసెంబర్ 2010, ఆదివారం

క్రీస్తు కి గ్రీటింగ్స్ తెల్పిన అయ్యప్ప


క్రిస్మస్ కదా సాయంత్రం మా గుణదల కొండ మీద ఉన్న అమ్మవారిని దర్శించు కొందామని, ఒక్కడినే వెళ్ళటం ఇష్టం లేక ( మా ఆవిడ మా అమ్మాయి కాలేజీ కి వెళ్ళింది పరీక్షలని కొన్ని రోజులు హాస్టల్ లోనే తోడు ఉందామని ) మా అపార్ట్మెంట్ లోనే ఉండే నా ఫ్రెండ్స్ శ్రీధర్ బి టెక్ మూడో సంవత్సరం , దీపూ మెడికో , తో బాటు నా ముద్దుల కూతురు డాలీ సెవెంతు క్లాస్ (మా ఆవిడ చెల్లెలి కూతురు) తో కలిసి నలుగురం వెళ్లాం. వీళ్ళే నా క్లోజ్ ఫ్రెండ్స్ మా అపార్ట్మెంట్లో. వాళ్ళ అమ్మ నాన్నలు కూడా అనుకోండి. కానీ ఇలా తిరగాలంటే వీళ్ళే రెడీ .మనసులో మా అమ్మాయి కూడా ఉండి ఉంటే బాగుండేది అన్న చిన్న లోటు కూడా ఉంది.

తెలీయని
వాళ్ళకోసం చెప్తున్నా మా బెజవాడ ని ఒక పక్క దుర్గమ్మ మరో పక్క మరియమ్మా' చెరో వైపూ కాస్కోని ఉన్నారు. దసరా రోజుల్లో ఎంత సందడో, క్రిస్టమస్ రోజు కానీ మేరీ మాత ఉత్శావాల్లో , కానీ మరే ఇతర క్రైస్తవ పర్వ దినాల్లో కానీ గుణదల మేరీ మాత గుడి దగ్గర అంతే కోలాహలం, సందడీ ఉంటాయి . బోలెడన్ని కొట్లు, లైటింగ్ ,జనం, రక రకాల వ్యక్తులతో కళ కళ లాడి పోతుంటుంది. అందులో పాలు పంచుకునేందుకే మా గ్యాంగ్ తో వెళ్లాను.

మంచి
ఉత్స్తాహం తో గబా గబా గుణదల కొండ ఎక్కేసాం. అక్కడ మేరీ మాతను దర్శింకొని, మెల్లగా దిగి కింద ఉన్న చర్చ్ లో కాసేపు కూర్చుందామని వెళ్లాం. అక్కడా బోలెడంత హడావిడీ. బాల యేసు బొమ్మ పెట్టారు ముద్దుగా బొద్దుగా అమాయకంగా అప్పుడే పుట్టిన పసి పిల్లల లాగానే అందరినీ చూస్తూ ఉన్నాడు. బొమ్మ నే చూస్తూ నుంచుంటే పక్కనే ఏదో పరిచయమున్న పరిమళం, పళని సుబ్రమణ్య స్వామి విభూతి సుగంధం మీరు సౌగంధ అనుభవించి ఉంటే నే చెప్పక్కర్లేదు, పరిమళం ఒక్క సారి చూడ గానే ఏదో గుళ్ళో ఉన్న పవిత్ర భావన కలిగిస్తుంది. ఎక్కడిదా అని పక్కకి తిరిగి చూస్తె నల్లని బట్టల్లో ముఖాన విభూది గంధం కుంకం బొట్లతో. మెడలో అయ్యప్ప మాల తో సాక్షాతూ అయ్యప్పే క్రీస్తుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడానికా అన్నట్లు అయ్యప్ప దీక్షలోని స్వామి.

స్వామి
ప్రార్ధన అయ్యాక మెల్లగా అయన పక్కన చేరా .... మీ పేరేంటి ? మీకు ఇలా సర్వమత సమానాత్వం ( అక్బర్ కి పర మత సహనం ఉండేది ?? తప్పు మాటేమో మనకి అన్ని మతాలలో నమ్మకం ఉంటె అది పరమతం ఎలా అవుతుంది) భావన ఎలా కలిగింది అని విలేకరి లా అడిగా. ఆయన పేరు చేజెర్ల శ్రీను స్వామి. గవర్నర్ పేట పెద్దిబొట్ల వారి వీధి లో లో ఒక చిన్న వస్త్ర దుకాణం కమ్ టైలోరింగ్ షాప్ పేరు డిఎన్ఆర్ టెక్స్ టైల్స్ అని చెప్పారు. మొత్తం కుటుంబం వచ్చారు అయన మాత ( దీక్ష లో ఉన్నారు కాబట్టి భార్య అనలేదు) రెండేళ్ళ పిల్లతో సహా.

ఆమె
కి కూడా అదే సంస్కారం అబ్బినట్లుంది చేతిలో స్వీట్ ప్యాకెట్ క్రిస్ట్ దగ్గర పెట్టి నలుగురికీ పంచారు. వాళ్ళ పాప చాలా అదృష్ట వంతురాలు అంతటి సంస్కార వంత మయిన తల్లి దండ్రులకి పుట్టి నందుకు. రాజకీయ లబ్ది కోసమో మరేదో ఆశించో మన నాయకులూ, సిని జీరోలు వేరే మత ప్రార్ధన స్తలాలకి వెళ్లి పుటోలు, లేదా క్లిప్పింగులూ టీవీల్లో చూపించుకున్నట్లు కాక, కేవలం ఆత్మ తృప్తి కై, దైవ భక్తి కై, తన కోసమే ఇలా అందరు దేవుళ్ళనీ కొలిచే అయన ముందు నిజం గా మోకరిల్లను.

పిల్లలకి
టేబుల్ మానెర్స్, పబ్లిక్ బిహేవియారు, అంటూ మోడరన్ ఎటికేట్స్ మాత్రమే నేర్పే తల్లి దండ్రులూ, టీచర్లు ఇవి కూడా నేర్పితే బాగుండు.

అయన
లాంటి నిరాడంబర భక్తుడికి నా అభినందన మల్లె పూదండ వేయటం లో నా స్వార్ధం కూడా ఉంది.
అయన
కి నా మల్లె పూదండ వేస్తె అయ్యప్ప కి వేసినట్లే.

అందుకే
సీనూ సామీ అందుకోండి నా మల్లె పూదండ.
మీరూ
అభినందిస్తా నంటే అయన ఫోన్ నెంబర్ 8121758 *** ఆయన్ని అడిగి ఇష్టముంటే మిగతా నెంబర్ ఇస్తా. అందాకా అయన ఫోటో చూడండి.

21, నవంబర్ 2010, ఆదివారం

ట్రాఫిక్ నియంత్రిస్తున్న ఆంద్ర కేసరి

ఈ రోజూ ఆదివారం మధ్యాహ్నం ఏదో పని ఉండి రింగ్ రోడ్ మీదకి వెళ్ళా ఎగ్జికుటివ్ క్లబ్ దగ్గర రోడ్ దాటి సాయిబాబా గుడి రోడ్ లోకి తిప్పే లోగా రోడ్ కుడి పక్క ట్రాఫిక్ పోలీసు గంభీరంగా నుంచొని కనపడ్డారు. నా కార్ పక్కనే ఉండటం వల్ల యధాలాపం గా ఆయన బాడ్జ్ వంక చూసా ఆంధ్ర కేసరి PC **** అని ఉంది. అయన పేరు ఆంధ్ర కేసరి ట. బాగుందే అనుకోని అయన వంక తేరిపార చూసి రోడ్ దాటి వెళ్ళిపోయా. ఆయనాకా పేరు పెట్టిన వాళ్ళ పెద్దలకు నమస్కారాలు తలచుకుంటూ.
అసలా పేరు పెట్టాలనే ఆలోచన ఎలా వాచ్చిందో అని కించిత్తు ఆశ్చర్యం కూడా వేసింది. మంచి దేశ భక్తి లేదా రాష్త్ర మంటే అభిమానం ఉన్న కుంటుంబం అన్న మాట అనుకున్నా. మా వూళ్ళో గాంధీలు, నెహ్రూలు, బోస్ లు , ఇంకామాట్లాడితే చదువు లేని సురేంద్రనాథ్ బెనర్జీలు , బిపిన్ చంద్ర పాలులు ఇంకా ఎక్కువ మాట్లాడితే పెట్టుబడిదారి మార్క్స్ లు స్టాలిన్ లు, లెనిన్ లు లాంటి పేరు చాలా సామాన్యం మరి వాళ్ళల్లో దేశ భక్తి నేతి బీరకాయో ? సిలోన్ కొబ్బరికాయో నాకు తెలీదు అందుకే ఈయన పేరు నాకు కొంచం ఆలోచింప చేసింది.ఒక గంట నా పనులు చూసుకొని ఆ రోడ్ లోనే మళ్ళీ వెనక్కి వచ్చా, ఆంధ్ర కేసరి గారు అక్కడే డ్యూటీ లో ఉన్నారు. సిగ్నల్ ఫ్రీ గా ఉన్నా నాకున్న అతి సాంఘిక తత్వం( అంటే ఏంటి అని అడక్కండి ముక్కు మొహం తెలియని వాళ్ళని సైతం బాగా చుట్టాలన్నట్లు మాట్లాడే నా నైజం కి ఇలా పేరు పెట్టుకున్నా) తో అయన పక్కనే నా వాహనం ఆపి మీ పేరు ఆంధ్ర కేసరి చాలా బాగుంది అన్నా. అయన వెంటనే పేరే కాదు నా నైజం కూడా అంతే అన్నారు. మా వాళ్ళు ఆ పేరు పెట్టినందుకు నేను ఆ పేరు నిలపెడుతున్నాను సర్ అన్నారు. నిజం గానా అన్నట్టు చూసా అయన వంక, నా చూపు లో భావం గ్రహించిన అయన " నిజమే సర్ మా వాళ్ళు ఆ పేరు పెట్టినందుకు నేను నిజం గానే ఆంధ్ర కేసరి గారి ధోరణి లోనే ఉద్యోగం చేస్తున్నా అన్నారు. అంటే పోలీసు ఉద్యోగం చాలా నిజాయితీ గా చేస్తున్నాను , అని సగర్వం గా మీదు మిక్కిలి స్థిరమైన స్వరం తో చాలా ఆత్మ విశ్వాసం తో చెప్పారు. అయన కళ్ళల్లో ఆ నిజాయితీ కనపడింది. అయన మాటల్లో ఆ విశ్వాసం, సమాజం పట్ల భాధ్యత, ఉద్యోగం మంటే గౌరవం కనపడ్డాయి. ఇవ్వన్ని వాస్తవాలు అని నేను నమ్ముతున్నా. డ్యూటీ లో ఉన్న అయన భుజం చుట్టూ చెయ్యేసి నడి రోడ్ మీద గట్టిగా ఆలింగనం చేసి నేనేం మాట్లాడానో నాకే గుర్తు లేదు అంత ఉద్వేగానికి లోనయ్యా. అయన కూడా చాలా సంభ్రమం గా ఉద్వేగం గా కనపడ్డారు , బహుశ ఆయన్ని ఇలా బహిరంగం గా ఒక అపరిచిత వ్యక్తి ఎలాంటి సందర్భం లేకుండా అభినందించి ఉండరు. ప్రజల నుంచి ఇలాంటి ప్రోత్సాహం , మెచ్చుకోలు కనపడితే అయన లాంటి నీతి మంతులైన ఉద్యోగులు పెరుగుతారేమో మనం ప్రయత్నిద్దాం.
అందుకే ఆయనకీ అయన లాంటి ఎందరో మహానుభావులకీ నా మల్లె పూదండ.
బంగారు కంచానికైనా గోడ చేర్పు కావాలి.....ఎంత నీతి మంతుడి కైనా గుర్తింపు కావాలి.

10, నవంబర్ 2010, బుధవారం

ఆ ఆదిలాబాద్ స్త్రీ ..

నా రెండవ దండ రెండు రోజుల క్రితమే వెయ్యాల్సి ఉంది ...
8 తేదీ ఉదయం న్యూస్ పేపర్ చదువుతూ యధాలాపం గా టీవీ వార్తల మీద ఒక చెవి వేసి ఉంచి నప్పుడు కేవలం పదిక్షణాల వార్త
ఆదిలాబాద్ లో ఒక సాధారణ మహిళా తనకు దొరికిన లక్షరూపాయలు పోగొట్టుకొనిన వ్యక్తి కి తిరిగి అందేలా చేసింది. ఆమె ను కూడా టీవీ లో చూపారు కానీ కేవలం పది క్షణాల వార్త మాత్రమే.
ఆమె ను ఛానల్ వారు అభినందించారు పొగిడారు. కానీ హడావిడిగా చూపిన వార్తలో ఆమె పేరు వివరాలు నాకుఅందేలోపు అయిపొయింది. ఆదిలాబాద్ లో మహిళ పూర్తి వివరాలు మరుసటి రోజూ పేపర్లలో గానీ లేక టీవీ లో గానీమళ్ళీ రాలేదు.
ఎంతో సామాన్యం గా కనపడ్డ ఆమె వ్యక్తిత్వ పరం గా ఎంతో ఉన్నతం గా అగుపించింది . అందుకే
మల్లె పూదండ
బ్లాగ్ టపా ద్వారా ఆమెని మనసారా అభినందిస్తున్నా..
టపా ద్వారా ఆమె లాంటి వాళ్ళు ఎంతో మందికి స్ఫూర్తి గా నిలవాలి.
ముఖ్యం గా పెళ్ళాం ఒంటిమీద నగలు అమర్చటానికో, పిల్లలను విలాసవంతం గా పెంచటానికి, మూడు తరాలా వరకూముందు చూపు తో ఆస్తి సంపాదించటానికి ఆరాట పడుతూ క్రమం లో వచ్చే జీతం చాలక ఉద్యోగం హోదా అడ్డు పెట్టుకుని గడ్డి తినే వెధవలకు, ఆమె లాంటి వాళ్ళు ఆదర్శం కావాలి.
మరింత ముఖ్యం గా లంచాల డబ్బులతో జల్సాలు చేస్తూ నిజాయితీ గా ఉండే వాళ్ళ ఆర్ధిక స్థితి ని హేళన చేసే జలగలుతెలుసు కోవాల్సినది " లంచాల సొమ్ము కన్నా నాలుగు రోడ్ల కూడలి లో మాడే కడుపుకి నాలుగు మెతుకుల కైనుంచునే వాళ్ళ సంపాదనే ఉత్తమం".
అక్రమ సంపాదన కోసం వెంపర్లాడే వెధలంతా ఆదిలాబాద్ స్త్రీ కాళ్ళు కడిగి నీళ్ళు తాగితే బుద్ధి వస్తుందేమోప్రయత్నించండి.

సినిమా వాళ్ల ఫలానా హీరో బామ్మర్ది గుట్కా వేస్కున్నాడు, ఇంకెవడి తమ్ముడో గంజాయి దమ్ము లాగాడు, ఫలానాహీరోయిన్ నాలుగో పెళ్లి ఐదో మొగాడితో లాంటి వార్తలు రోజంతా ప్రసారం చేసే టీవీ ఛానళ్ళు ఇలాంటి నీతివంతుల వార్తలు పెద్ద ఇష్టం గా ఎక్కువ సేపు చూపవు. అది వాళ్ల ఇష్టం లెండి మనమేమీ చేయలేము.

నేను మాత్రం నే వార్తల్లో చూసిన అదిలాబాద్ స్త్రీకి జేజేలు చెప్తూ, మీ సాక్షిగా మనసారా అభినందన మల్లె పూదండ వేస్తున్నా...
ఆమె, ఆమె కుటుంబం అభివృధి లోకి రావాలని కోరుకుంటూ....
విన్నపం : మీలో ఎవరికైనా ఆమె వివరాలు తెలిస్తే నాకు తెలియ పరచండి ఈ టపా ని సవరించి రాస్తా. మీకు థాంక్స్ కూడచెప్తా.


6, నవంబర్ 2010, శనివారం

ఆయనకి వంట వచ్చు


మల్లె పూదండ అనే శీర్షిక తో నా బ్లాగ్ మొదలు పెట్టినప్పుడు నాకు ఈయన గురించి తెలీదు.
ఆయనకు వంట బాగా వచ్చుట, నాకు వంట వచ్చిన మగాళ్లంటే ఇష్టం కారణం నాక్కోడా రావటమే కాదు.
వంట రావటమంటే చాల ఓపిక ఒద్దిక ఉన్న వాళ్ళని నా అభిప్రాయం, అందుకే ఆడాళ్ళకి అవి రెండు ఎక్కువ అంటారు.
ప్రపంచవ్యాప్తం గా ఎక్కువ ఆడాళ్ళే వంట చేస్తారు కాబట్టి ఆ రెండు వాళ్ళకే ఉన్నాయని నమ్ముతున్నా.
అంతే కాదు వంట రావటమంటే సృజనాత్మికత ఉన్నట్టు అలాగే ప్రేమించే గుణం కూడ బాగా ఉన్నట్టే. సరే మగాళ్ళలో వంట వస్తే ఈ గుణాలన్నీ ఉంటాయా..?
ఈ లక్షణాలన్నీ వంట చేసే వాళ్ళందరికీ ఉన్నాయో లేవో నాకు తెలీదు కానీ ఒకాయన ఉన్నారు.పేరు నారాయణన్ కృష్ణన్
మదురై లో ఉన్న ఈ 28 ఏళ్ళ యువకుడు హోటల్ మానేజ్మెంట్ & పాక శాస్త్రం లో చాలా ఖర్చు పెట్టి చదువు కుని 2002 లో స్విట్జెర్లాండ్ లో మంచి ఉద్యోగం సంపాదించి విమానం ఎక్కే ముందు ఒకసారి ఇంటికెళ్ళి అమ్మ నాన్న లను చూసి వెళ్దామని వచ్చి అక్కడున్న రెండు రోజులలో తన జీవితాన్నే మలుపు తిప్పే మరియు ఎందరికో ఆదర్శవంత మయ్యే నిర్ణయం తీస్కున్నారు.
ఆ నిర్ణయానికి దారి తీసిన పరిస్తితులేంటంటే రోడ్ మీద దిక్కు లేని, కూడు గుడ్డ గూడు కు నోచుకోని అనాధల పోషణ.
ఎవరూ లేని ఉన్నా పట్టించుకోని మానసిక వ్యాధి గ్రస్తులు , ఇంకా రోగపీడితులు, శాప గ్రస్తులు ఆయినా వేలాది జనం ( మదురై లో అంతకన్నా ఎక్కువ మంది ఉంటారని అనుకోను).
అలాంటి వేలాది మంది దీనులలో ఒక మానసిక రోగి ని, ఆకలి కి తట్టుకోలేక లేక మతి బ్రమణం లోనో తన మలాన్నే తాను తింటున్న ( సభ్య నాగరిక ప్రజలారా నేను విన్నదానిని బట్టి ఇది రాసాను) వ్యక్తి ని నారాయణన్ కృష్ణన్ చూసారు. చూసాక ఎక్కువ మంది చేసే పని జుగుప్స్త తో తల తిప్పుకోలేదు, కొంత మందిలా జేబులో డబ్బులిచ్చి ఎమన్నా తిను అని చెప్పి వెళ్లి పోలేదు. ఆ వ్యక్తి కి ఆహారం ఇచ్చారు ఇచ్చాక అయన చేయి ఆ అనాధ పట్టుకున్నారు . ఆ సంఘటన లో ఆ ముదుసలి కి ఆహారం అందిచ్చిన తర్వాత ఆయన తన చేతి ని పట్టుకున్న స్పర్శ నారాయణన్ కు అమిత మైన స్పూర్తిని ,శక్తీ ని ఇచ్చిందిట. దాని తర్వాత అయన తీసుకున్న నిర్ణయం మాత్రం అత్యంత ఖరీదైనది.
స్విట్జెర్లాండ్ లో నివసించటానికి వచ్చిన విలాస వంత మైన జీవితం, లాభసాటి జీతం, ప్రపంచం లోనే అత్యంత సౌందర్య భరిత ఆగోగ్య వాతావరణం అన్నీ వదిలేసి ఇక్కడే మదురై లో ఒక అనాధ శరణాలయం నడప టానికి స్థిరపడ్డారు. జూన్ 2002 లో అయన స్థాపించిన అక్షయ ట్రస్ట్ ఎంతో మంది అన్నార్తులకు కడుపు నింపుతోంది.
అనాధలకు ,రోగ గ్రస్తులకు ఒక స్థిర నివాసం ఏర్పాటు చేయటం. ప్రతి దినము కొన్ని వందల మందికి కడుపు నిండా భోజనం పెట్టటం ఆ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశ్యం.
ప్రతి ఉదయం నాలుగు గంటలకు మొదలయ్యే అయన దిన చర్య .. దీనుల కు ఆహారం అందిచ్చటమే కాక స్నానం చేయించటం, శుబ్రమైన వస్త్రాలను అమర్చటం వంటి పనుల తో రాత్రి పూర్తి అవుతుంది.
ఉత్తుత్తి ఫైట్లు చేసే మన సినిమా హీరో ల కన్నా, స్వార్ధ సేవలు చేసే నాయకుల కన్నా, బాగా సంపాదించి ఆనక పేరు కోసం ప్రజాసేవ చేసే మన సినీ నాయకుల కన్నా నాకు ఈ హీరో చాలా అందంగా కనపడుతున్నాడు.
చదివితే సిద్ధార్ధుడు గౌతమ బుద్దుని గా మారిన వైనం గా ఉన్న నారాయణన్ కృష్ణన్ ఉదంతం మన అందరికీ ఎంతో ఆదర్శం. మనం చేస్తున్నా పనులు మానేసి అయనలా చెయ్యలేక పోయినా, ఆయనంత త్యాగ గుణం మనకు లేక పోయినా అయన లాంటి వాళ్లకు తోచిన సాయమందిస్తే మనకూ ఎంతో కొంత పుణ్య ఫలం తృప్తి కలుగుతాయని నా నమ్మకం.
అందుకే నా మొదటి మల్లె పూదండ నారాయణన్ కృష్ణన్ గారికి.
అయన చిరునామా
Akshaya's Helping in H.E.L.P. Trust
9, West 1st Main Street, Doak Nagar Extension,
Madurai 625 010. India
Ph: +91(0)452 4353439/2587104
Cell:+91 98433 19933.
email : ramdost@sancharnet.in

www.akshayatrust.org
ఆయన గురించి మాకు బానే తెలుసు నువ్వు చెప్పేదేంటి అంటున్నారా నా మల్లె పూదండ నే వేస్తేనే నాకు తృప్తి.

5, నవంబర్ 2010, శుక్రవారం

ఎవరి కోసమీ మల్లెపూదండ....

మల్లె పూదండ అని పేరు పెట్టా గానీ, అది ఎవరికో ఎందుకో చెప్పలేదు
ఇప్పటి వరకు, కారణం బిజీ గా ఉండటం.

అసలు ఈ బ్లాగ్ మొదలు పెట్టిన ఉద్దేశ్యం ఈ మల్లె పూదండ ని అప్పుడప్పుడు ఎవరికన్నా వేయాలని
ఇదేమీ స్వయంవరం కాదు కానీ స్వయం గా మెచ్చుకోవటానికి వీలు లేని మనచుట్టూ ఉన్న వ్యక్తులకో,
వార్తల్లో వ్యక్తులకో ఎవరికన్నా వేయటానికే నా ఈ మల్లెపూదండ...
వివరం గా చెప్పాలంటే ఎవరన్నా మంచి పని చేసారన్న సంగతి తెలుసుకొని
వారిని అభినందించాలని అనిపించినా
వ్యక్తి గతం గా చెప్ప లేనప్పుడు
ఈ బ్లాగ్ ద్వారా నా అభినందన మల్లె పూదండ వేస్తా నన్న మాట.

ఒక రకమైన తృప్తి కలిగించే ఈ చర్య మీ కందరికీ కూడ నచ్చుతుందని ఆశిస్తున్నా.
నా లిపి లేని భాష ను చదివి అర్ధం చేసుకున్నట్లే మల్లెపూదండను కూడా ఆఘ్రాణిస్తారా....??
ధన్యవాదములు
ఆత్రేయ