14, ఆగస్టు 2011, ఆదివారం

నాకా ఆగస్ట్ పదిహేనే కావాలి


"నాకు ఆగస్ట్ పదిహేనే కావాలి..." కోరిక గా ..
" ఏది ?" సందేహం గా
"అదే " మొండిగా
"ఏదే..?" కొంచం విసుగ్గా..
" అదే నాకు ఏడేళ్ళ వయసులో పొద్దున్నే లేచి స్నానం చేసి. పక్క పాపిడి తీస్కోని దువ్వుకొని. ఆకుపచ్చ లాగూ పై తెల్ల చొక్కా వేస్కొని, వేడి అన్నంలో పెరుగు వేస్కొని హడావిడి గా తిని, హవాయి చెప్పులతో పొద్దున్నే
స్కూల్ కెళ్ళి , ఎవరో ఇచ్చిన కాగితపు జండా బాడ్జ్ చొక్కాకి పెట్టుకొని, పూలతో జండా కర్ర మెట్లు అలంకరించి. సున్నం తో వేసిన లైన్ల మీద కుదురుగా నుంచోని, సరిగ్గా ఎనిమిది కి మా సుగుణమ్మ ప్రిన్సిపాల్ గారు ఎగర వేసిన జండాకి వందనం పెట్టి . ఆమె చెప్పిన నాలుగు మాటలు వినీ విననట్లు ఉండి. అదయ్యాక అక్కలు పంచిన బిళ్ళలు చప్పరించి, పది దాకా స్కూల్లోనే ఆడుకుంటూ, దేశ భక్తి ప్రదర్శిస్తూ, ఎండ ఎక్కాక ఇంటికెళ్ళిన రోజుల్లోని ఆగస్ట్ పదిహేను." వస్తుందా మళ్ళీ ఆశగా..
"ఇప్పుదేమైందట" కరుగ్గా ..
" ఏమీ కాలేదు మామూలు రోజుల్లో ఆఫీసులో సరిగ్గా టైముకు రాక, వచ్చాక సీట్లో లేక పెత్తనాలు చేసే జనం రోజు పొద్దున్నే వచ్చి ఆఫీసు డబ్బులతో టిఫిన్లు మెక్కి, దేశ భక్తి, నిస్వార్ధమూ , త్యాగమూ , పునరంకితమూ
అంటూ కొన్ని వాళ్ళకీ తెలీని మాటలు మాట్లాడి చెమట తుడుచుకొని ఏసీ లోకి వచ్చి రిలాక్స్ అవుతుండటం నాకు నచ్చలేదు."
" దేశ సేవ పేరుతో పంది కొక్కుల్లా తిని తెగ బలిసి తన్నుకుంటున్న నాయకులు నాకు నచ్చలా "
" లంచాల సొమ్ము కోసం ప్రజలని పీడించే ప్రభుత్వ జలగలు నాకు నచ్చలా"
" మన కెందుకూ మన డాలర్లు మన కొస్తున్నాయా లేవా అని చూసుకునే వలస మేధావులు నాకు నచ్చలా"
" మనం మార్చగలిగేవి కావు కుళ్ళు రాజకీయాలు, తీర్చగలిగేవి కావు కష్ట నష్టాలు అంటూ వక్కపొడి నములుతూ వెనక్కి వాలే నిలవ మేతావులు నాకు నచ్చలా" ..ఉక్రోషం గా
" అందుకే నా పాత ఆగస్ట్ పదిహేనన్నా తెచ్చివ్వు లేదా ఇంకా వెనక్కి వెళ్లి తెల్ల పాలనన్నా తెచ్చివ్వు " అమాయకంగా
" ఎందుకూ.." అయోమయం గా ..
" మళ్ళీ బ్రిటీష్ వాళ్ళతో పోరాడి మీరు మరో స్వాతంత్రం తెచ్చుకుంటే నన్నా విలువ తెలుస్తుందేమో అని " కసిగా

" నిస్వార్ధం గా అవినీతి పై పోరాడాలంటే ఇన్ని కస్టాలు పడాలా అని వాపోయే వీరులందరికీ నా మల్లె పూదండ " ఆర్తి గా
జై
హింద్ !!