2, జనవరి 2011, ఆదివారం

అన్నమయ్య పి.వో


ఈ నాటి నా ఈ ఐదో మల్లెపూదండ శ్రవణ్ గారికి. ఎవరీ శ్రవణ్ ?? బ్లాగ్ వీధుల్లో సంచరించే మిత్రులకి పెద్దగా చెప్పక్కర్లేదు, అయినా మల్లె పూదండ తో సత్కరిస్తూ పరిచయ వాక్యాలు రాయక పోతే మా సన్మాన సంఘం మరీ ఖాళీ గా ఉన్నట్టే, అందుకే ఈ పరిచయం.

జగమెరిగిన అన్నమయ్యకి ఉన్న ఎంతో మంది పబ్లిసిటీ ఆఫీసర్ల లో శ్రవణ్ ఒకరు.

పిడుగురాళ్ళ లో పుట్టిన శ్రవణ్ గారు ఆర్ఈసి వరంగల్ లో ఇంజనీరింగ్ పట్టభద్రుడు. తల్లితండ్రులు కనక దుర్గ , సుబ్రహ్మణ్యం గారలు. అమ్మగారి స్ఫూర్తి తో ఆయనకు సంగీతం మీద, అదీ అన్నమయ్య కీర్తనల మీద మంచి ఆసక్తి కలిగింది. ఆ ఆసక్తి కేవలం విని ఊరుకోవటం వరకే కాకుండా పది మందికి ఉపయోగ పడే విధంగా తీర్చి దిద్దు కోవటం అయన సుసంస్కారం.

ఇరవై ఏడు ఏళ్ళ వయసుతో బాటు ఈయనకి ఒక ఎంఎన్ సి టెలికాం కంపనీ లో గట్టి ఉద్యోగం, ఉరకలేసే ఉత్సాహం , మీదు మిక్కిలి ఎన్నో ఆనందాలు అందిచ్చే హైదరాబాద్ నగరం లో నివాసం, ఇవన్నీ ఉన్నా అయన వారాంతం లో ఏ మిత్రులతో సినిమాహాల్లోనో, పబ్ లోనో, పిక్నిక్ స్పాట్ లోనో సమయాన్ని చంపకుండా.. తొలి తెలుగు వాగ్గేయ కారుడు అన్నమాచార్యునితో టైం పాస్ చేస్తారు.

శ్రవణ్ ఇంట్లోనే అన్నమయ్య కూడా ఉంటారు. శ్రవణ్ ఆయనతోనే ఎక్కువ సమయం గడుపుతారు. నిజం, ఉద్యోగ సమయం లో తప్ప మిగతా సమయం లో హెచ్చు మొత్తం అన్నమయ్య కీర్తనల సాహిత్యం, శ్రవణరూపం, ఇంకా ఆ కీర్తనల యొక్క ప్రశస్తి, వివరాల సేకరణ లో ఉంటారు. అలా సేకరించిన విషయాల్ని తన బ్లాగ్ అన్నమయ్య లో పొందుపరుస్తారు.

ఆ వివరాలు అన్నమయ్య కీర్తనల ప్రియులకు తిరుపతి లడ్డు లాంటివి. ఇప్పటివరకు సుమారు 733 కీర్తనల ఆడియో లింకులు, సాహిత్యం తో బాటు ఆ అంశాలకి సంభందిచిన వివరాలు, కీర్తన పాడిన వారి చిత్రాలు, కూడా ప్రచురిస్తున్నారు. అంతే కాక ఆ బ్లాగ్ ని ఒక తీరుగా అమర్చారు. మనకి కావాలిసిన కీర్తన వెతుకోవటానికి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అక్షర క్రమం లో ఉంచారు. అంతే కాక తి తి దే వారు ప్రచురించిన 29 సంకలనాల అన్నమయ్య సాహిత్యాన్ని కూడా pdf లో ఉంచారు. ఇక పోతే అన్నమయ్య రేడియో ఎల్లప్పుడూ వీనుల విందు చేస్తూనే ఉంటుంది.

అన్నమయ్య గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. దాదాపు ముప్పై ఏళ్ళ క్రితం మాత్రం చాలా మంది సామాన్యులకు ఆ సాహిత్య ప్రతి దొరక్క, వినడానికి సరియిన ఉపకరణాలు లేక, అసహాయ స్థితి లో ఉండటం నాకు బాగా గుర్తుంది. అలాంటిది రెండువేల పైగా కీర్తనలు గుర్తింపబడి, స్వరపరచ బడి, ఎందరో సంగీత స్రష్టల కృషి, తి తి దే వారి సహకారాల తో అన్నమయ్య సాహిత్యం ప్రాచుర్యం లోకి వచ్చింది.

అవన్నీ ఎప్పటికైనా తన బ్లాగ్ ద్వార అందుబాటు లోకి తేవటం అయన అభిలాష. మన మల్లె పూదండ లో ఉన్న వ్యక్తి దీపాల వెంకట నాగార్జున శ్రవణ్ తమ అమూల్యమైన సమయాన్ని ఇలా జనోపకారం కోసం వెచ్చించటం నిజంగా ముదావహం. ఆయన్ని నేను చూడలేదు, అయన బ్లాగ్ లో ఒకటీ రెండు వ్యాఖ్యల పరిచయం అంతే. కానీ ఆ బ్లాగ్ టపా ల ద్వారా అయన నాకు ఎంతో ఆత్మీయం గా అనిపించారు. ఉద్యోగం, అన్నమయ్య బ్లాగ్ వ్యాపకాలతో బాటు అయన వయోలిన్ నేర్చుకోవటానికి ప్రయత్నించటం, ఎం.ఎస్ విద్య ను అభ్యసించటం వంటి ఫలవంతమైన పనులు చేస్తున్నారు. ఆయన లాంటి ఆదర్శనీయమైన యువత ఇంకా లక్షల మందికి స్ఫూర్తి కావాలని మనసార కోరుకుంటున్నాను. అన్నమయ్య సంకీర్తనల మీద అయన నాలుగు బ్లాగులు నిర్వహిస్తునారు. అది కాక జానపదాలు, త్యాగయ్య కీర్తనలు ఇంకా అనేక సంగీత సాహిత్య వివరాలను తన రామచిలుక పలుకులు
లో పొందుపరుస్తున్నారు.

కేవలం బాగా చదువు కోవటమో, మంచి ఉద్యోగం చేస్తూ తన సంగతి తాను చూసుకొని బాగా బతకటమో, లేదా ఎలాంటి ఆసక్తి లేకుండా నిస్సారమైన బతుకు వెళ్లదీసే వాళ్లకు అప్పుడప్పుడు శ్రవణ్ లాంటి వాళ్ళు మల్టీ విటమిన్ టాబ్లెట్ లాగా పనిచేయాలి.


వివిధ రకాలుగా సమయం వృధా చేసే ఎందరికో శ్రవణ్ ఒక ఆదర్శం కావాలి. అందరూ సంగీతమే పాడక్కర్లేదు, అందరూ సంఘ సేవ చెయ్యక్కర్లేదు, కానీ నీ తీరిక సమయం లో ఏమి చేస్తున్నావని అడిగితే "నేను ఇది చేస్తున్నా.." అని గర్వంగా చెప్పుకోదగ్గ ఏ పని చేసే వాళ్లెవారికైనా మల్లె పూదండ సిద్ధం.


ఈమధ్యే
వివాహం అయిన శ్రవణ్ కు అయన సతీమణి కు మన బ్లాగ్ మిత్రుల తరుపున అభినందనలు.




చిన్న వయసులోనే సమాజం పట్ల భాద్యత చూపుతూ సేవ చేసే యువత కు ఇంకో మల్లె పూదండ తో కలుస్తా.. సెలవ్